ఉపరితల ద్రోణి.. రెండు తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్ష సూచన

  • కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
  • ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వెల్లడించిన వాతావరణ శాఖ
  • ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనాన్ని కలిగించే వార్త చెప్పింది. కర్ణాటక నుండి రాయలసీమ, తెలంగాణ మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వాతావరణ మార్పుల వల్ల గత కొన్ని రోజులుగా నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి, వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.


తెలంగాణ విషయానికి వస్తే... జోగులాంబ గద్వాల, ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లొండ, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాల వర్షాల నేపథ్యంలో ఉరుములు సంభవించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయట తిరగవద్దని అధికారులు సూచించారు.


ఆంధ్రప్రదేశ్‌లో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా రైతులు తమ కోతకు వచ్చిన పంటలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులు కోరారు.


Telangana Rains
Andhra Pradesh Rains
Rain Alert
Weather Forecast
IMD
Rayalaseema
Coastal Andhra
Hyderabad Weather
Telangana Weather
AP Weather

More Telugu News